తల్లిదండ్రుల మాట ఎందుకు తెస్తారు-రష్మి

reshmi-serious

తాను చేసే సినిమాలు జనాలకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం.. తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తోంది యాంకర్ టర్న్డ్ హీరోయిన్ రష్మి గౌతమ్. తాను గత రెండేళ్లలో ఇలాంటి కామెంట్లు చాలా ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘నేను గుంటూరు టాకీస్ సినిమాలో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమాను థియేటర్లలో జనాలు ఎంజాయ్ చేయడం చూశాను. కానీ బయటికి వచ్చాక మాత్రం సినిమాను తిట్టారు. ఒక సినిమా చూడాలా వద్దా అన్నది సెన్సార్ బోర్డు నిర్ణయిస్తుంది. సినిమాలు చేసే మాకూ బాధ్యత ఉంటుంది. సినిమాలు చూడటంలో ఎవరి ఛాయిస్ వాళ్లది. ఐతే సినిమా నచ్చకపోతే ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం.

కానీ సినిమా ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ ను ఎలా నిర్ణయిస్తారు? ఆమె పెంపకం గురించి.. కుటుంబ విలువలు.. నైతికత గురించి ఎందుకు మాట్లాడతారు? ఇలాంటి అమ్మాయిని కన్న తండ్రి ఎవరు? తల్లి ఎవరు? ఆమె పెళ్లి చేసుకోవచ్చు కదా?.. ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారు? ఇలాంటి విషయాలపై నాతో నేరుగా చర్చ పెడితే వాళ్లకు నేను సమాధానం ఇస్తాను. కానీ సోషల్ మీడియాలో ఐడెంటిటీ దాచుకుని ఇష్టానుసారం కామెంట్లు చేస్తుంటారు. దమ్ముంటే నాతో నేరుగా డిస్కషన్ పెట్టాలి’’ అని రష్మి సవాలు విసిరింది.