తొలి సినిమా 10 కోట్లు.. రెండోది 150 కోట్లు!!

sujith-next-movie

తన తొలి సినిమాను ఒక దర్శకుడు పది కోట్ల బడ్జెట్ లో తీసి హిట్టు కొడితే.. రెండో సినిమా బడ్జెట్  20 కోట్లో.. 30 కోట్లో అయితే ఆశ్చర్యమేమీ లేదు. కానీ బడ్జెట్ ఏకంగా 15 రెట్లు పెరిగి రూ.150 కోట్లకు చేరితే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ‘రన్’ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ఇప్పుడు ఈ అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. అతడి తొలి సినిమా బడ్జెట్ రూ.10 కోట్ల లోపే. కానీ ప్రభాస్ తో సుజీత్ చేయబోయే రెండో సినిమా బడ్జెట్ 15 రెట్లు పెరిగి ఏకంగా రూ.150 కోట్లకు చేరడం విశేషం.

ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన రెండేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభాస్ ‘బాహుబలి’కే అంకితమైపోవడంతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో మరో సినిమా చేసుకునే అవకాశమున్నా సుజీత్ రాజీ పడలేదు. తన రెండో సినిమా ప్రభాస్ తోనే చేసి తీరాలని పట్టుబట్టాడు. అందుకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాడు. అతడి ఎదురు చూపులు ఫలించి ఈ డిసెంబర్ లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఐతే ఈ చిత్రానికి సుజీత్ మొదట్లో అడిగిన బడ్జెట్ రూ.50 కోట్లు. అప్పటి మార్కెట్ ప్రకారం ఇది పెద్ద మొత్తమే. అయినా యువి క్రియేషన్స్ వాళ్లు రెడీ అయ్యారు. ఐతే ‘బాహుబలి’ విడుదల తర్వాత ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడి మార్కెట్ బాగా విస్తరించింది. ముందు తెలుగు వరకే అనుకున్న సుజీత్ సినిమా ఇప్పుడు హిందీ.. తమిళ భాషల్లోనూ తెరకెక్కబోతోంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెంచుకోవడానికి అవకాశం దక్కింది. సినిమాకు మంచి మార్కెట్ కూడా వస్తుండటంతో బడ్జెట్ కూడా పెరిగి రూ.150 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.